కోదాడ, మే 14 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన, సాంకేతిక విద్య లభిస్తుందని కోదాడ ఎంఈఓ సలీం అన్నారు. గురువారం కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్య ద్వారానే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీ, కరపత్రాలతో బడిబాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ” పాఠశాల విద్యాభివృద్ధి, రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల నమోదు పెంచడానికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాల 2026 పదో తరగతి పరీక్ష ఫలితాలలో డివిజన్ టాపర్ గా 572 మార్కులను సాధించి 99 శాతం ఫలితాలతో 15 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి సూర్యాపేట జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాల పాఠశాలగా నిలిచిందని తెలిపారు.
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలు కంప్యూటర్ విద్య, డిజిటల్ విద్యా బోధన, చదువుతో పాటు సంస్కారం పై దృష్టి పెట్టి, విలువలతో కూడిన విద్య బోధనతో అర్హత అనుభవం అంకితభావం గల ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థుల భవిష్యత్తు సర్వతోముఖాభివృద్ధి , వికాసం కోసం వివిధ రకాల కోకరికులం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి.మార్కండేయ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.