నల్లగొండ జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండ్లు కట్టుకున్న వారి పేరున కాకుండా మరొకరి బ్యాంకు ఖాతాలో బిల్లులు జమ కావడంతో లబ్ధిదారులు హౌసింగ్ డిపార్టుమెంటు చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా పంచాయతీ కార్యదర్శుల తప్పిదం వల్లే జరిగిందని, మేం ఏమీ చేయలేమని, క్షేత్ర స్థాయిలోనే సమస్య పరిష్కరించుకోవాలంటూ హౌసింగ్ శాఖ అధికారులు చేతులెత్తేయడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
నల్లగొండ, అక్టోబర్ 7: కనగల్ మండలం తిమ్మన్న గూడానికి చెందిన పందుల రజిత అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో బేస్మెంట్ లెవెల్ వర కు ఇల్లు నిర్మించుకుంది. అయితే ఇందిరమ్మ బిల్లుకు సంబంధించిన డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా.. అదే గ్రామంలో ఆమె పేరుతోనే ఉన్న మరో మహిళ ఖాతాలో జమ అయ్యాయి.
మర్రిగూడ మండలం శివన్నగూడెంలో యాదమ్మ (పేరు మార్చాం) అనే మహిళ ఇల్లు కడితే అదే గ్రామంలో ఆమె పేరుతోనే ఉన్న మరో మహిళ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇలా మునుగోడు మండలంలో 19, తిప్పర్తి మండలంలో 11 ఉదంతాలు వెలుగు చూశాయి. ఇలా ఇల్లు ఒకరు కడితే మరొకరి ఖాతాలో డబ్బులు జమకావడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
దీంతో ఏం చేయా లో తెలియక పంచాయతీ కార్యదర్శులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోకపోవటంతో జిల్లా కేంద్రంలోని హౌసింగ్ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీనిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలే తప్ప తామే మీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తుండగా.. ఖాతాలో డబ్బులు పడ్డవారు మాత్రం సంతోషంతో విందులు, వినోదాలు చేసుకుంటున్నారు.
ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాలో..
నియోజకవర్గంలో 9820 మంది ఇండ్లకు మాత్రమే అధికారులు గ్రౌండింగ్ చేశారు. అందులోనూ 7530 మంది బేస్మెంట్ లెవెల్ వరకు, 1519 మంది రూఫ్ లెవల్ వరకు, 560 మంది స్లాబ్ లెవల్ వరకు, ముగ్గురు పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణాలు చేశారు. అయితే బేస్మెంట్ లెవల్ నుంచి చివరిస్థాయి వరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఫొటోలు తీసి, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అనే యాప్లో అప్లోడ్ చేయాలి.
అయితే ఇది బాగానే ఉన్నా ఒకే ఊరులో, ఒకే ఇంటి పేరుతో ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు ఉంటే ఒకరికి బదులు మరొకరి బ్యాంకు ఖాతాలను అప్లోడ్ చేయడంతో ఇండ్లు కట్టుకున్న వారి ఖాతాల్లో కాకుం డా.. కట్టుకోని వారి ఖాతాల్లో డబ్బులు పడటంతో అసలైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
హౌసింగ్ కార్యాలయం చుట్టూ చక్కర్లు..
ఒకే పేరుతో ఉన్న ఇరువురికి ఇందిరమ్మ ఇండ్లు మం జూరు కాగా కొందరివే గ్రౌండింగ్ అయ్యాయి. అయితే గ్రౌండింగ్ అనంతరం ఇండ్లు కట్టుకున్న వారి ఖాతాల్లో కాకుండా ఇతరుల ఖాతాల్లో డబ్బులు పడటంతో లబ్ధిదారులు కార్యదర్శులను సంప్రదించారు. వారు పట్టించుకోకపోవడంతో హౌసింగ్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు.
హౌసింగ్ అధికారులు మాత్రం గ్రామంలోని పెద్దమనుషుల మధ్య తేల్చుకోవాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు పడిన వారు మాత్రం మాకు ఆకాశ రామన్న డబ్బులు వేశాడంటూ జల్సాలు చేస్తున్నారు. అడిగితే మీ డబ్బులే అని గ్యారెంటీ ఏంటి.. మా దగ్గర లేవ్..అని సమాధానం ఇస్తున్నారట.
మరో మహిళకు డబ్బులేశారు…
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఉన్న ఇల్లు కూల్చి రూ.లక్షన్నరతో బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకున్నా. అయితే అధికారు లు మాత్రం నా ఖాతాలో డబ్బు లు వేయకుండా నా పేరుతో ఉన్న మరో మహిళ ఖాతాలో డబ్బులు వేశారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవటం లేదు. హౌసింగ్ అధికారులకు చెప్పినా స్పందన లేకపోవటంతో ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ విలేకరి తిమ్మన్న గూడెం కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా నేను సరిగానే ఖాతా అప్లోడ్ చేశా..వేరే మహిళ ఖాతా లో ఎందుకు పడ్డాయో తెల్వదు. దీనిపై విచారణ చేస్తా అన్నారు. – రజిత, తిమ్మన్న గూడెం, కనగల్ మండలం