నల్లగొండ, ఆగస్టు 04 : స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభధ్రం తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని అలకాపురి కాలనీలో గల కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో సీపీఎం జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హాజరైన తమ్మినేని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 6 నుంచి 15 వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటన చేయాలన్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంతకాల సేకరణ, 20 నుంచి 30వ తేదీ వరకు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు, గ్రామ పంచాయతీల వద్ద ధర్నాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 1న తాసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు, ముట్టడిలు నిర్వహించాలన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏండ్లుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, భావోద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంసకర పాలన చేస్తుందని దుయ్యబట్టారు. దేశ పరువు దిగజారే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నా ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ప్రధాని మోదీ నోరు ఎందుకు మెదపడం లేదో చెప్పాలన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, కాలేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టి మళ్లిస్తుందని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు నిధుల కొరత పేరిట తప్పించుకోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంత వరకు గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వానకాల సీజన్ కొనసాగుతుందని, పెండింగ్లో ఉన్న రైతుబంధు, రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నిర్ణయించిన కర్తవ్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని దానికోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్లో పార్టీ తీసుకునే కర్తవ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హాసం, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Nalgonda : స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు : తమ్మినేని వీరభద్రం