మహిళలకు పట్టుచీరలంటే మహాప్రీతి. పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలకు వీటినే ఎక్కువగా ధరిస్తారు. అయితే, ఆయా కార్యక్రమాల్లోనే చీరలకు ఎక్కువగా మరకలు అవుతుంటాయి. పూజలో ఉన్నప్పుడు పసుపు, నూనెలు పడుతుంటాయి. పార్టీలలో ఆహార పదార్థాలు అంటుకుంటాయి. అన్నీ కలిసి పట్టుచీరల అందాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో చాలామంది పట్టుచీరలను డ్రైక్లీనింగ్‌కు ఇస్తారు. అయితే, ఇంట్లోనే ఈజీగా పట్టుచీరలపై మరకలను తొలగించే చిట్కాలు కొన్ని ఉన్నాయి.
నిమ్మరసం సమర్థంగా పనిచేస్తుంది. మరక పడినచోట కొద్దిగా నిమ్మరసం అప్లయి చేయాలి. దానిపై కొంచెం బేకింగ్ సోడా చల్లి, అది నురగలా వచ్చే వరకూ ఉంచాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత.. చల్లని నీటితో మరక పడిన భాగాన్ని కడిగేస్తే.. పసుపు మరక తొలగిపోతుంది.
చీర మీద నూనె పడితే.. ఆ ప్రదేశంలో వెంటనే కార్న్‌ఫ్లోర్, టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి. దాని మీద ఓ టిష్యూ పేపర్ ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉండనిస్తే.. నూనె మొత్తాన్నీ టిష్యూ పీల్చేస్తుంది. ఆ తర్వాత పట్టు చీరపై మెల్లగా, తక్కువ ఒత్తిడితో బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మరక పూర్తిగా తొలగిపోతుంది. ఒకవేళ మరక ఇంకా ఉంటే.. కొద్దిగా నీరు తీసుకొని, తక్కువ గాఢత కలిగిన షాంపూని కొంచెం కలపాలి. అందులో మెత్తని కాటన్ వస్త్రం ముంచి, మరక ఉన్న భాగంలో నెమ్మదిగా తుడిస్తే.. మరక మాయం అవుతుంది.
ఆహారపు మరకలను వదిలించడంలో వెనిగర్ చక్కగా పనిచేస్తుంది. చల్లటి నీటిలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ ద్రావణంలో ఓ మెత్తని కాటన్ వస్ర్తాన్ని ముంచి.. పట్టుచీరపై మరకలు పడిన ప్రాంతాన్ని సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత కొంచెం గ్లిజరిన్ తీసుకుని మరకపై రాసి.. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి.
సిరా, పెన్ మరకలు పడినచోట కొద్దిగా గోరువెచ్చని పాలు పోసి, కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ సోప్ వాడి నెమ్మదిగా శుభ్రం చేయాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడినా, కాటన్ బాల్‌పై కొద్దిగా ఆల్కహాల్ వేసి అద్దినా.. సిరా మరకలు తొలగిపోతాయి.