నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 24 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు గతంలో మాదిరిగానే ఈ సారి కూడా అమ్మవారి ప్రసాదాన్ని ఇంటికే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవారి ప్రసాదంతోపాటు పసుపు, కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందజేయనుంది. మేడారం జాతర ఈ నెల 21నుంచి 24 వరకు జరుగనుండగా.. గురువారం నుంచి ఈ నెల 25 వరకు అన్లైన్, ఆఫ్లైన్లో అమ్మవారి ప్రసాదాన్ని బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది.
రూ.299 చెల్లించి బుకింగ్ చేసుకోవాలి
జాతరకు వెళ్లలేని భక్తులు సమీపంలోని టీఎస్ ఆర్టీసీ కార్గో కౌంటర్లలో మేడారం జాతర ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతోపాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేయనున్నారు. బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని కార్గో సెంటర్లో ఈ సేవ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు.