నీలగిరి, మార్చి 24 : పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎస్.హెచ్.ఓ గది తదితర విభాగాలను ఎస్పీ పరిశీలించి, స్టేషన్ పరిధిలో కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను సమగ్రంగా తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించరాదని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్రంగా విచారణ చేసి, చట్ట ప్రకారం నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణ స్పందన చూపాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ విధుల్లో ఉన్న సిబ్బంది డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజూ తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించి, మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ మరియు డయల్ 100 సేవల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్.ఐ శంకర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.