నల్లగొండ ప్రతినిధి, మార్చి14(నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి జిల్లాలో వరుసగా రెండో రోజు నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం సభలో సస్పెన్షన్ ప్రకటన వెలువడగానే తక్షణమే చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పార్టీ నేతలు ఆందోళనలకు దిగారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిరసిస్తూ మిర్యాలగూడలో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి సాగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వం తక్షణమే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్టాండ్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడే ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే జగదీశ్‌రెడ్డిపై పెట్టిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, ప్రభుత్వ కుట్రపూరిత చర్యలు మానుకోవాలని నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దమనం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తూ కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. మఠంపల్లిలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నిరసన ప్రదర్శనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిడేపల్లిలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలు స్పందించి నిరసన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టారు. నేరడుచర్లలోనూ పార్టీ నేతలు జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకవీడు మండల కేంద్రంలో పార్టీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇక సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీకి చెందిన దళిత నేతలు నెమ్మాది భిక్షం, జీడి భిక్షం తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. దళితుల పట్ల జగదీశ్‌రెడ్డికి ఆపారమైన ప్రేమ ఉంటుందని, ఆయన దళిత పక్షపాతి అని స్పష్టం చేశారు. దళిత స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని జగదీశ్‌రెడ్డిపై నీచ రాజకీయాలకు తెర లేపడం తగదన్నారు. తక్షణమే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.