– ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపు
రామగిరి, జనవరి 16 : లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ర్యాలీ, సభను జయప్రదం చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 19న జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో నిర్వహిస్తున్న జీపు జాత ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ప్రచార క్యాంపెయిన్ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలను సమీకరించి సమరశీల ఉద్యమాలు చేస్తామని తెలిపారు. మోదీ విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్ జీ గా మార్చి పేదల పొట్ట కొట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ చట్టం 2025 ప్రకారం భవిష్యత్లో విద్యుత్ రంగం ప్రైవేటు పరమై సబ్సిడీలు పోతాయని, ప్రజలు, రైతులపై మరింత భారం పెరగనుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడుదారులకు అప్పనంగా అప్పజెప్తోందని విమర్శించారు.
ఈ విధానాలపై కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త ప్రచార కంపెయిన్ జయప్రదం చేయాలని కోరుతూ గ్రామస్థాయి వరకు ప్రచార జాతలు జనవరి 19న సభతో ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తామని తెలిపారు. ఈ నెల 19న నల్లగొండలో జరిగే సభకు అధిక సంఖ్యల కార్మికులు, కర్షకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సీఐటీయూ పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, రైతు సంఘం అధ్యక్షుడు ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, తాపీ కార్మిక సంఘం ఎండీ సర్దార్ అలీ, అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య, సంఘాల నాయకులు గంజి రాజేశ్, సీహెచ్ అనురాధ, సీత వెంకటయ్య, బీములపల్లి శంకర్, నరసింహ పాల్గొన్నారు.

Ramagiri : ’19న నల్లగొండలో జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలి’