పెన్పహాడ్, జూలై 23 : పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది. దీంతో రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోడ్డుపై సీపీఎం ఆధ్వర్యంలో వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు భోగరాజు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోడ్డు అస్తవ్యస్తంగా, పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో వాహనదారులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
వ్యవసాయ పనులకు వెళ్లే ట్రాక్టర్లు, బైకులే కాకుండా పాదచారులు సైతం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయమై కాలు తీసి కాలు వేసి పరిస్థితి లేకుండా తయారైందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండేటి రాములు ముత్తయ్య వెంకన్న, సోములు, వీరయ్య పాల్గొన్నారు.