రామగిరి, మార్చి 12: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యాభివృద్ధితో పాటు వర్సిటీ అభివృద్ధికి చేపట్టే అంశాల ప్రతిపాదనలను వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సమర్పించారు. ఎంజీయూ వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశపెట్టే కొత్త కోర్సులు, అభివృద్ది ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసేందుకు బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ప్రొఫెసర్లు విద్యాధర్‌రెడ్డి, బాలకృష్ణ, మృణాళిని, శోభారాణి ఎంజీయూను సందర్శించారు. వీరికి వీసీతోపాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వీసీ అల్తాఫ్ హుస్సేన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివిధ అంశాలను వివరించారు.
అనంతరం కమిటీ సభ్యులు ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల, సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ ఎంబీఏ కళాశాలతోపాటు పానగల్‌లోని వర్సిటీ కళాశాలను పరిశీలించారు. నివేదికను సీల్డ్కవర్లో ఉన్నత విద్యామండలికి అందిస్తామని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ అంజిరెడ్డి, ఇన్స్ట్రక్టర్ డైరెక్టర్ ఆకుల రవి, సీఓఈ ఉపేందర్‌రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఐక్యూఏసీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.