రామగిరి, అక్టోబర్ 15 : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, పీజీ కాలేజీలు మంగళవారం కూడా తెరుచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డియాండ్ చేస్తూ ఎంజీయూ పరిధిలో 76 కళాశాలలు రెండో రోజూ బంద్ పాటించాయి. తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. భువనగిరిలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, వినాయక చౌరస్తాలో నిరసన తెలిపారు. రామన్నపేటలో శ్రీ హిందూ డిగ్రీ కళాశాల గేటుకు అధ్యాపకులు తాళం వేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు తమ బాధలు పట్టించుకోవడం లేదని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కళాశాలలు కూడా బంద్‌లో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం బీఈడీ కళాశాలల్లో ప్రాక్టికల్స్ జరుగుతుండగా, అవి పూర్తికాగానే బంద్‌కు వెళ్లనున్నట్లు యాజమన్యాలు వెల్లడిస్తున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలల యాజమన్యాలు, అధ్యాపకులు బంద్‌లో భాగంగా బుధవారం ఉదయం భారీ ర్యాలీ తీయనున్నట్లు వెల్లడించాయి. హైదరాబాద్ రోడ్డులోని కాకతీయ కళాశాల నుంచి ఎన్ కళాశాల, రామగిరి మీదుగా గడియారం సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపాయి.