రామగిరి, అక్టోబర్ 14 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, ఎంజీయూ రిజిస్ట్రార్‌కు బంద్ నోటీసు అందించినా స్పందన లేకపోవడంతో సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 76 కాలేజీలను తెరువలేదు. సర్కారు నిర్లక్ష్యంతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని పలు యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నల్లగొండ జిలా ్లకేంద్రంలో అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసి రామగిరిలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల వద్దకు ఆయా యాజమాన్యాలు, అధ్యాపక బృందాలు చేరుకున్నాయి. ఫ్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా టీపీడీపీఎంఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నిర్వహణ, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలకు అప్పులు చేయాల్సి వస్తున్నదని, తెచ్చిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు ప్రతి రోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. తొలి రోజు బంద్‌లో టీపీడీపీఎంఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కె.రామ్మోహన్, డాక్టర్ నర్సింహారెడ్డి, గుండెబోయిన జానయ్యయాదవ్ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు 76 ఉన్నాయి. వాటిలో ప్రతి సంవత్సరం 16 వేల మంది విద్యార్థులు దోస్త్, సీజీ గేట్ ద్వారా అడ్మిషన్లు తీసుకుని చదువుకుంటున్నారు. వారి నుంచి ఫీజు తీసుకోకుండానే ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ ఇచ్చి బోధన అందిస్తున్నాయి. ఒక్కో ఏడాదికి రూ.55 కోట్ల చొప్పున బకాయి ఉన్నదని టీపీడీపీఎంఏ తెలిపారు.