రామగిరి, మార్చి 15 : ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విడుదలలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ యాజమాన్యాలు మరోమారు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గత అక్టోబర్, నవంబర్‌లో కాలేజీలను బంద్ పెట్టగా.. ప్రభుత్వ హామీతో తిరిగి తరగతులు ప్రారంభించారు. కానీ, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడుపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం టీపీడీపీఎంఏ ఎంజీయూ యాజమాన్యాలు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కలిసి వినతి పత్రం అందించాయి.
ఈ సందర్భంగా టీపీడీఎంఏ ఎంజీయూ శాఖ అధ్యక్షుడు, నీలగిరి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్నారు. అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుములు, బిల్డిండ్ ట్యాక్స్ చెల్లించేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో జరుగనున్న డిగ్రీ 2, 4, 6 రెగ్యులర్ సెమిస్టర్, 1, 3, 5 బ్యాక్ లాగ్ పరీక్షలను బహిష్కరిస్తామని తెలిపారు. వినతి పత్రం అందచేసిన వారిలో టీపీడీపీఎంఏ ఎంజీయూ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సైదారావు, సత్యం గౌడ్, జైపాల్‌రెడ్డి, గుండెబోయిన జానయ్యయాదవ్, రాజశేఖర్, నగేశ్, హన్ముంతు ఉన్నారు.