రామగిరి, మే 14: యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బుధవారం నల్లగొండ ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు .. నల్లగొండ మండలం కాకుల కొండరాం గ్రామానికి చెందిన యువతికి మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన మనిమిద్దె సాయిరాంతో ఓ ఫంక్షన్లో పరిచయం ఏర్పడింది. సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ సాయిరాం చెప్పగా అందుకు ఆమె నిరాకరించింది.
అయినా సదరు యువకుడు వినకుండా తనను ప్రేమించాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఆగస్టు8, 2024న నల్లగొండ మండలం కంచనపల్లి జడ్పీహైస్కూల్ వద్ద వ్యక్తిగత పని కోసం వెళ్లిన యువతిపై సాయిరాం హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు నల్లగొండ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సైదాబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటారు. ఈ నేరానికి సహకరించిన నందినిపై కూడా కేసు నమోదు అయినప్పటికీ ఆమెను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడు వేర్వేరు సెక్షన్ల కింద సాయిరాంకు ఏడున్నర ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 8వేల జరిమానా విధించారు. శిక్షను తక్షణమే అమలు చేయాలని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసు విచారణలో నిందితురాలికి న్యాయం జరిగేలా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్లాల్, దర్యాప్తు చేసిన ఎస్ఐ సైదాబాబు, టూ టౌన్ సీఐ రాఘరావు, సీడీఓ కె.దుర్గారాజు, కోర్టు లైజన అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.