యాదగిరిగుట్ట, మే 23: సీఎం పర్యటన సందర్భంగా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణుల ఇండ్లకు పోలీసులు వెళ్లి ముందస్తుగా అరె స్టు చేశారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. గుట్టలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మున్సిపల్ కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ, నాయకులు గునగంటి బాబూరావు, ఆరె శ్రీధర్, వార్డు సభ్యుడు కర్రె చంద్రశేఖర్ తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి పట్టణ యువతకు ఉపాధి కల్పించాలని కోరిన యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లో ఉంచారు.
ధాన్యం కొనుగోళ్లపై నిరసన
ఓ వైపు నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో రైతులు పడిగాపులు కాస్తున్నారని, కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండలంలోని అన్ని గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. గుట్టలో రేవంత్రెడ్డి పర్యటనను నిరసిస్తూ ఆయా గ్రామాల్లో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలు, నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశా రు. మల్లాపురం, గౌరాయిపల్లి గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాలు, బాహుపేట పరిధిలోని యశోజి గూడెం రైతులు నిరసన వ్యక్తం చేశారు.
పోలీస్ అధికారుల అత్యుత్సాహం..
సీఎం పర్యటనలో పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపారు. స్వామివారి దర్శనం ముగించుకున్న సీఎం టెంపుల్ సిటీ హెలిపాడ్ వద్దకు రాగానే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సీఎం వద్దకు వెళ్లేందుకు వీలులేదని ప్రిన్సిపల్ సెక్రటరీతో వాదించారు. దీంతో ఆయన నేను కూడా డ్యూటీ చేస్తున్నా. నీ ప్రవర్తన సరైంది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఫ్లెక్సీలతో నిండిపోయిన గుట్ట
దేవస్థాన ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రైవేట్ సంస్థల ప్రకటనల ఫ్లెక్సీలు పెట్టేందుకు వీలులేదనే నిబంధన ఉంది. కొండకింద వైకుంఠ ద్వారం నుంచి కొండ చుట్టూ రింగ్ రోడ్డు ప్రాంతంలో దేవస్థాన ప్రచారం, కరపత్రాలు, ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాగింది. ఆలయం చుట్టూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలతో నింపారు.దీంతో దేవస్థానమా.. కాంగ్రెస్ కార్యాలయమా అని భక్తులు చర్చించుకున్నారు.