చండూరు, మే 10 : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేని దద్దమ్మ అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరులో నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులను శనివారం అయన పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయ మార్కెట్ వద్ద నుంచి చండూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాదని.. ఆయన గోల్మాల్ రాజగోపాలం అని నినాదాలు చేశారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమీ చేయలేని రాజగోపాలం ఏ మొఖం పెట్టుకొని తిరుగుతున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అని మండిపడ్డారు. నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల సంవత్సర కాలంగా చండూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులు తప్ప ఇప్పుడు ఒక్క రూపాయీ తేలేదని ఆరోపించారు.
మునుగోడులో క్యాంపు కార్యాలయం తన హయాంలో కట్టించి ప్రారంభించిన శిలాఫలకాన్ని తీసేసి మళ్లీ ఆయన పేరుతో వేయడం సిగ్గుచేటు అన్నారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై ఉంటే ఈ ప్రాంతం ఎప్పుడో అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. ఆయనకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అన్న మంత్రిగా ఉన్నారు.. నిధులు తెచ్చి అభివృద్ధి చేయవచ్చుగా అని ప్రశ్నించారు. గతంలో పండిన పంటలో ఇప్పుడు 20శాతం కూడా పండలేదని, అయినా ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేండ్లు కాకముందే కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, నాయకులు పాల్గొన్నారు.