నార్కట్పల్లి, ఆగస్టు 5 : కృష్ణా పరీవాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులన్నీ నిండి నీరు వృథాగా వెళ్తున్నందున జిల్లాలోని చెరువులన్నీ నింపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగు నీరు విడుదల చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సరైన వర్షాలు లేక రైతులు నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
జిల్లాలో నాలుగు వేల చెరువులు ఉన్నాయని, నకిరేకల్ నియోజకవర్గంలో 350 చెరువులు ఉన్నాయని, ముందస్తుగా చెరువులకు మరమ్మతులు చేసి ప్రాజెక్టుల ద్వారా నీటిని నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధిక నిధులు తీసుకొచ్చి ట్రయల్ రన్ సక్సెస్ చేశామని, ఆ తర్వాతే మండలంలోని అన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
తమ హయాంలో భూ సేకరణ ఎంతో జరిగిందని, కొద్దిపాటి భూ సేకరణ పూర్తి చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. అలాగే అయిటిపాముల ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతోపాటు ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రెండు సార్లు పంటల పెట్టుబడికి రైతు బంధు ఇవ్వగా, కాంగ్రెస్ పాలనలో రైతుబంధు లేదని, రుణమాఫీ అంటూ ఆర్భాటానికే పరిమితమయ్యిందని ఎద్దేవా చేశారు. లక్ష రూపాయలు రుణం ఉన్న రైతుల్లో 30 శాతమే మాఫీ అయ్యిందని తెలిపారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి సన్నాలకే ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు.
నిత్యం అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నాయకులు యానాల అశోక్ రెడ్డి, దుబ్బాక శ్రీధర్, మల్గ బాలకృష్ణ, కొండూరి శంకర్, నడింపల్లి నరేశ్, పుల్లెంల వెంకట్, సత్తిరెడ్డి పాల్గొన్నారు.