నల్లగొండ జిల్లా : నల్గొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి(MLC election) పోలింగ్ మొదలైంది. నియోజకవర్గంలో మొత్తం 25 వేల 797 మంది ఓటర్లు ఉండగా 200 ల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండలో 37 పోలింగ్ కేంద్రాలకు 250 మంది సిబ్బంది సూర్యాపేట జిల్లాలో 23 కేంద్రాలకు 133 మంది సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్లకు 104 మందిని నియమించారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8,311 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాగా, రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు నియోజకవర్గాలలో మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్‌లో పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 ఓటర్లు ఉండగా 56 అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం 27,088 మంది ఉపాధ్యాయులు ఓట్లు నమోదు చేసుకోగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల పరిధిలో అధికారులు 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. ఇక్కడ 25,797 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ స్థానం నుంచి 19మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల పోలింగ్ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది సామగ్రితో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.