హుజూర్నగర్, మే 12 : దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ పార్టీ సీనియర్ నాయకురాలు పశ కన్నమ్మ సంతాప సభకు హాజరై ఆయన మాట్లాడారు. నిజాన్ని నిక్కచ్చిగా, ధైర్యంగా చెప్పే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. అసలైన కమ్యూనిస్టులు తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్తారన్నారు. కమ్యూనిస్టులు భావజాలం ప్రకారం ఎక్కడ వెనుకబడి లేరని నిర్ణయక పాత్రలో ఉన్న విషయం అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు మద్దతు ఉన్న పక్షమే అధికారం చేజిక్కించుకోవడం దీనికి నిదర్శనం అన్నారు.
ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడంలో కమ్యూనిస్టులు వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని, డబ్బులే ఖర్చు పెడితే కమ్యూనిస్టులే గెలుస్తారన్నారు. మనిషికి ఆకలి ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయని, ఉద్యమాలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారన్నారు. ప్రజల పట్ల, సమాజం పట్ల అంకిత భావం ఎర్ర జెండాకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ, అక్కినేని వనజ, భావం హేమంతరావు, మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి రజని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, రైతాంగ పోరాట నాయకుడు దొడ్డ నారాయణరావు, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తేల సృజన, రంగారెడ్డి సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, గంగాభవాని, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, ప్రేమ్ పావని, అమీనా, సదాలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.