నిడమనూరు, జూలై 26 : నిడమనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మండల పరిషత్ కాంప్లెక్స్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పోలీస్ స్టేషన్ పక్కా భవనం దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పెచ్చులు తరచూ ఊడి పడుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. భవనం దుస్థితిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దృష్టికి ఎస్ఐ ఉప్పు సురేశ్ తీసుకెళ్లడంతో పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా మండల పరిషత్ కాంప్లెక్స్ భవనంలోకి తరలించాలని సూచించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతి తీసుకోవడంతో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కాంప్లెక్స్ భవనాన్ని అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. భవనం ఆవరణలోని పిచ్చి చెట్లను, అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగిస్తున్నారు. సోమవారం నుంచి పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు కాంప్లెక్స్ భవనం నుండే కొనసాగనున్నాయి. కాంప్లెక్స్ భవనంలో 2016 నుంచి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నిర్వహించగా ఇటీవల నూతన పక్కా భవనంలోకి కోర్టును తరలించిన విషయం తెలిసిందే.