నల్లగొండ సిటీ, జూన్ 11 : నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 7 గంటల్లో చేధించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బైరం అంజిబాబు, భార్య భాగ్యలక్ష్మి దంపతులకు 20 నెలల వయసు గల సోమేశ్వర్ కుమార్ ఉన్నాడు. భాగ్యలక్ష్మి ప్రస్తుతం 8 నెలల గర్భవతి కావడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారి ఇంటి పక్కనే ఉండే పార్వతమ్మ తోడుగా వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం బాలుడు తల్లితో పాటు ఆమె సహాయంగా ఉన్న పార్వతమ్మతో కలిసి ప్రసూతి విభాగం ముందు ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు వారితో పరిచయం పెంచుకుని బాలుడిని ఆడించారు. బాబును మేము చూసుకుంటాం మీరు వెళ్లి భోజనం చేసి రమ్మని అనడంతో నమ్మిన బాలుడి తల్లి, పార్వతమ్మ భోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి బాబు, మహిళలు కనిపించకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలు పరిశీలించగా బాలుడు కిడ్నాప్‌నకు గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేశారు. మహిళల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో ఉన్న బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అరుణ అనే మహిళ తన కొడుకు ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మగ పిల్లాడిని పెంచుకోవాలనే దురాలోచనతో జంతిక సుక్కమ్మ అలియాస్ పాలడుగు సుగుణమ్మతో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Nalgonda City : బాలుడి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు