నీలగిరి, మే 26: నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నారోటిక్ డాగ్, 200 మంది పోలీసులు పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు చేశారు. 360 ఇండ్లలో తనిఖీలు చేసి 46 మంది అనుమానితులు, ఉత్తరప్రదేశ్ కు చెందిన 10 మంది, బీహార్‌కు చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి, అసోంకు చెందిన ఒక వ్యక్తి, హర్యాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆరుగురికి గంజా టెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు గంజాయి తాగినట్లు గుర్తించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుటా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, అధిక శబ్ధం కలిగిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నేర నియంత్రణే లక్ష్యం నల్లగొండలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కొలను శివారంరెడ్డి, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, మహాలక్ష్మయ్య, రాము, కరుణాకర్, ఎస్ఐలు సైదులు, శంకర్, మాసన, విజయబాయి, రవీందర్ ఉన్నారు.