తిప్పర్తి, మే13 : ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌కు చెందిన మోహమ్మద్ నసీర్(ఏ1), నల్లగొండ పట్టణం ఓల్డ్‌సిటీకి చెందిన గాజుల జ్యోతి(ఏ2) కొంతకాలంగా నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల చొప్పున వసూలు చేశారు. ఈ క్రమంలో తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఏపూరి హెప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిప్పర్తి, మాడ్గులపల్లి, నల్లగొండ మండలాలకు చెందిన మొత్తం 31మంది బాధితుల నుంచి రూ.10,32,000 వసూలు చేశారు. వీరిపైన తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో 4, నల్లగొండ వన్‌టౌన్‌లో 3 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక మోటర్ సైకిల్, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు త్వరితగతిన ఛేదించిన శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, పీసీ రాంరెడ్డి, పోలీస్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. అమాయకులైన నిరుద్యోగ యువతకు జాబ్ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్లను నమ్మి మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది సతీశ్, రాజీవ్, సురేశ్ తదితరులు ఉన్నారు.