రామగిరి, సెప్టెంబర్ 5: నల్లగొండ జిల్లా కేంద్రం పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో నంబర్ 1 వినాయక విగ్రహం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విగ్రహం వద్ద గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతిసారీ ప్రజాప్రతినిధులను, ప్రముఖులను, ఆధ్యాత్మికవేత్తలను వేదికపైకి ఆహ్వానించి శాంతి సందేశం ఇప్పించడం ఆనవాయితీ. ఈపర్యాయం వేదికపైకి బీజేపీ జిల్లా అధ్యక్షుడిని పిలవక పోవడం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ లతీఫ్సబ్ గుట్టపై ఘట్‌రోడ్డు, పలు రాజకీయ విషయాలను ప్రస్తావించడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మాట్లాడిన తీరును బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్ది తప్పుపట్టారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటతో పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని పోలీసు కారులో ఎక్కించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు అనుచరులు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కంచర్లనులోనికి వెళ్లనివ్వలేదు. బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు మంత్రిని పక నుంచి పంపించారు. లోపలికి వెళ్లిన కంచర్ల పోలీసుల తీరుపై మండిపడ్డారు.
దేవుడి దగ్గర రాజకీయాలు చేయడమేంటన్నారు. తాము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. నాగం వర్షిత్‌రెడ్డిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎవరి మెప్పు కోసమని ప్రశ్నించారు. దేవుడి దగ్గర రాజకీయాలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. నాగం వర్షిత్‌రెడ్డిని విడుదల చేసే వరకు విగ్రహాన్ని కదలనివ్వమని పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.
వెంటనే నాగం వర్షిత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నాయకులు సింగం రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేశ్, గుండ్రెడ్డి యుగంధర్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రంజిత్‌కుమార్, గుండెబోయిన జంగయ్య, దొడ్డి రమేశ్, బీపంగి కిరణ్, మహిళా నాయకులు కోండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, పెరిక ఝౌన్సీ తదితరులు పాల్గొన్నారు.