యాదగిరిగుట్ట, డిసెంబర్4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో టెండరుదారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ స్టాల్‌కు బదులు శాశ్వత షెడ్లను నిర్మిస్తున్నారు. పుట్ పాత్‌ను కబ్జా చేసి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలోనూ లేనివిధంగా ఈసారి కొండ కింద వైకుంఠ ద్వారం మొబైల్ టీ, స్నాక్స్ స్టాల్ నిర్వహణకు రెండేండ్ల కాల పరిమితితో దేవస్థానం లీజ్ టెండర్ వేసింది. ఎమ్మెల్యే అనుచరులుగా చలామణి అవుతున్న కొంతమంది నాయకులు టెండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ స్టాల్‌ను ఏర్పాటు చేసి టీ, స్నాక్స్‌ను మాత్రమే విక్రయించాలని నిబంధనలో ఉన్నా.. అందుకు విరుద్ధంగా శాశ్వత షెడ్డును ఏర్పాటు చేశారు.
పుట్ పాత్‌ను పూర్తిగా కబ్జా చేసి పర్మినెంట్ షెడ్డు వేశారు. దాంతో కొండపైకి వెళ్లే భక్తులతోపాటు వాహనాల పార్కింగ్, గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొండకు చేరుకోగానే ముందుగా వైకుంఠ ద్వారం వద్ద స్వామివారికి మొక్కి కొబ్బరికాయ సమర్పిస్తారు. కొందరు వైకుంఠ ద్వారం నుంచే కొండపైకి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో కొద్దిమంది టీ తాగేందుకు వచ్చి సిగరెట్లు కూడా సైతం సేవిస్తూ భక్తులను అసౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని టెండర్ల కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండగా, వైకుంఠ ద్వారం వద్ద వేసిన స్టాల్‌కు మాత్రం రెండేండ్ల సమయం ఇచ్చారు. ఈ స్టాల్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా ప్రారంభమవడం గమనార్హం.
శాశ్వత షెడ్డును తొలగించాలి
దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ స్టాల్‌కు బదులు శాశ్వత షెడ్డును ఏర్పాటు చేశారు. దాంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే శాశ్వత షెడ్డును నిర్మించారు. ఇంత జరుగుతున్నా దేవస్థాన ఈవో పట్టించుకోవడం లేదు. వెంటనే శాశ్వత షెడ్డును తొలగించాలి. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతాం.
-పాపట్ల నరహరి, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్