రామగిరి, ఆగస్టు 29 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పరుగులో 70 మంది విద్యార్థులు పాలుపంచుకోగా గెలుపొందిన వారికి వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్లో స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ హరీశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ, జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు పరిపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించే సాధనాలన్నారు. ఎంజీయూలో క్రీడలకు సైతం రెండు క్రెడిట్లను అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మొబైల్ వాడకం కన్నా దేహ దారుడ్యం, మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి సంఘ జీవనానికి, సహకారాలకు పునాది లాంటి క్రీడలపై దృష్టి సారించాలని ఆకాక్షించారు.
జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడుతూ.. ఉత్తమ సదుపాయాలు కలిగిన ఎంజీయూలో జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయాలని, అందుకు తగిన శిక్షణలు, ఖేలో ఇండియా వంటి క్రీడలను నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. జాతి నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి చలనశీలత, బుద్ధి కుశలతకు క్రీడలు దోహద పడతాయన్నారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్, ఎంజీయూలో మొట్టమొదటిసారిగా వివిధ అంశాల్లో స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.రామావత్ మురళి, డా. వై.శ్రీనివాసరెడ్డి, కో ఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు.