పెన్‌పహాడ్, డిసెంబర్ 23 : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా ప్రజాప్రతినిధులు పాలన అందించాలని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. పెన్‌పహాడ్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదేండ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించానన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని, అందుకోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. నిర్మాణాత్మక తెలంగాణ కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలన అందిస్తే పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. ప్రజాప్రతినిధులు మెరుగైన పాలన అందించాలని సూచించారు. అనంతరం హ్యాట్రిక్ విజయం సాధించి మొదటిసారిగా మండలానికి వచ్చిన ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, జానకిరాంరెడ్డి, తాసీల్దార్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.