నందికొండ, డిసెంబర్ 27 : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండ శుక్రవారం పర్యాటకులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవులకుతోడు వారాంత దినాలు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ టూరిజం కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జునకొండకు, జాలీ ట్రిప్పులకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.
నల్లమల్ల అడవుల సహజ అందాల మధ్య లాంచీ ప్రయాణం బాగుందని పర్యాటకులు తెలిపారు. నదీ తీరంలో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. పర్యాటకులతో నాగార్జునసాగర్ డ్యామ్, లాంచీ స్టేషన్, బుద్ధవనం పరిసరాలు కిటకిటలాడాయి. నవంబర్ రెండున నాగార్జునసాగర్ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలను టూరిజం శాఖ ప్రారంభించింది. ప్రతి శనివారం లాంచీ శ్రీశైలం బయల్దేరి తిరిగి ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది.
ఇప్పటి వరకు విజయవంతంగా శ్రీశైలానికి 8 లాంచీ ట్రిప్పులను టూరిజం శాఖ నడుపగా శనివారం 9 ట్రిప్పు వెళ్లనున్నది. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 560 అడుగులు ఉన్నంత వరకు శ్రీశైలానికి లాంచీలను నాగార్జుసాగర్ నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్టం 573.80 అడుగుల వద్ద ఉంది. 9వ ట్రిప్పు తర్వాత ఇంకొక ట్రిప్పుతో శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు ముగేసే అవకాశం ఉంది. శ్రీశైలం లాంచీ ట్రిప్పులను పర్యాటకులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టూరిజం అధికారులు కోరారు.