ప్రైవేటుకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు
సిజేరియన్ల తగ్గుదలకు ప్రత్యేక దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండేళ్లలో ఒక్క మలేరియా కేసు నమోదు కాలేదు
రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
యాదాద్రి భువనగిరి, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అన్ని వసతులను కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధుల బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.11,300 కోట్ల కేటాయించిందని తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు డైరెక్టుగా ఆశ కార్యకర్తలు, వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపి వైద్యశాఖను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. వైద్య శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో వసతులను మెరుగుపర్చి క్వాలీఫై వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతం అపరేషన్లు జరుగుతున్నాయని, ప్రతి ఆపరేషన్‌కు రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేయడం వల్ల బాధితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సిజేరియన్లు తగ్గించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో తరచూ ఆడిట్ నిర్వహించడంతోపాటు, గైనకాలజిస్టులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టీబీ, డెంగీ, మలేరియా, ఇతర డిసీజ్లకు సంబంధించి జిల్లామంచి ఫలితాలను సాధిస్తున్నదని, మలేరియాకు సంబంధించి రెండేళ్లలో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, డెంగీ కేసులు కూడా రెండు, మూడు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు, వైద్యాధికారులతో జిల్లాలో చేపడుతున్న వైద్య సేవలను సమీక్షించారు. ప్రతి నెలా జిల్లా క్యాలెండర్ ఏర్పాటు చేసుకుని హెల్త్ ఇండికేటర్స్‌ను సమీక్షించుకోవాలని సూచించారు.