నార్కట్‌పల్లి, జూలై 3: చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఉరుకులు పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రోడ్డు విస్తరణతో పాటు అభివృద్ధి పనులు ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. అసంపూర్తి పనులు, అసౌకర్యాల రోడ్లతో పట్టణ కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏండ్ల తరబడి ఎదురుచూసిన రోడ్డు విస్తరణ పనులు చివరి దశకు చేరిన వాటిని కూడా చేయలేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే సంకల్పంతో రెడ్డయ్య కంపెనీ నుంచి కామినేని జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో పాటు డ్రైనేజీ నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవ తీసుకొని రూ.16 కోట్లు మంజూరు చేయించారు. విస్తరణ పనులకు 2023 ఏప్రిల్ 20న శంకుస్థాపన చేశారు. పట్టణలోని లారీ ఆఫీస్ నుంచి సన్‌షైన్ కాలనీ వరకు మొదటిగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. పనులు చకచకా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది. దీంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
లారీ ఆఫీస్ నుంచి రెడ్డయ్య కంపెనీ వరకు, సన్‌షైన్ నుంచి కామినేని జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ అంటూ మంచిగా ఉన్న రోడ్డును తొలగించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు డ్రైనేజీ, సెంట్రల్ డివైడర్ పనులకు బ్రేకులు పడటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరమ్మతులు అంటూ గంటలకొద్దీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ పట్టణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నారు. ఇస్టానుసారంగా నామమాత్రంగానే స్తంభాలు ఏర్పాటు చేశారని, గాలికి స్తంభాలు ఓ వైపు వంగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రోడ్డుకు ఇరురైపులా విస్తరణ చేపట్టినా ఫుట్‌పాత్‌పైకి వ్యాపారులు వస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయా లు కావడంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ పట్టణంలో పర్యటించి పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేస్తున్న చిరువ్యాపారులకు రోడ్డు భద్రతపై ఆవగాహన కల్పించారు.
రోడ్డుకు 50 ఫీట్ల అవతల వ్యాపారాలు చేసుకునేలా దిశా నిర్దేశం చేశారు. దీంతో వ్యాపారులు దుకాణాలను రోడ్డుకు దూరంగా పెట్టకున్నారు. కొద్ది రోజుల తరువాత షాపుల నిర్వాహకులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. శుక్రవారం వచ్చిందంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్‌తో సతమతమవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వంలోనే మెజార్టీ పనులు జరిగిన విస్తరణకు ఈ సర్కారు పూర్తిగా బ్రేకులు వేసింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనుల్లో భాగం గా విద్యుత్ మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ పనులతో పాటు రోడ్డుకు ఇరువైపులా పాత స్తంభాలను తొలిగించి కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ను గంటల కొద్దీ నిలిపేస్తున్నారు. అధికారులు ముందస్తుగా ప్రజలకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. పనులు మాత్రం నామమాత్రంగా చేసుకుంటూ పోతున్నారు.
ఇష్టానుసారంగా స్తంభాలను ఏర్పాటు చేయ డం, స్తంభాలను పటిష్టంగా కాంక్రీట్‌తో ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు. ఇటీవల గాలి దుమారానికి స్తంభాలు ఓ వైపు ఒరిగాయి. మరోవైపు చిన్నపాటి గాలి దుమారానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.