తిరుమలగిరి, మే 23 : మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గం ముఖ్య కూడలి కావడంతో ఇక్కడి నుంచి నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, జనగాం, భువనగిరి ప్రాంతాలకు ప్రజలు ప్రయాణం సాగిస్తుంటారు. ఈ్ర కమంలో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
చౌరస్తాలో ద్విచక్ర వాహనాలతోపాటు వివిధ వాహనాలను రోడ్లు పైన ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. షాపుల యజమానులు రోడ్లపైకి చొచ్చుకొని వచ్చి రేకులు, పందిళ్లు వేయడం కూడా ట్రాఫిక్ సమస్యకు ఓ కారణమవుతున్నది. దీనికితోడు చిరువ్యాపారులు రోడ్లపై అమ్మకాలు సాగించడం వల్ల నడవడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతున్నది.
మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంతలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చౌరస్తాలో, సంతవద్ద రోడ్డుపై అస్తవ్యస్తంగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. పోలీసులు, అధికారులు రోడ్లపై వాహనాలు నిలుపకుండా చూడాలని, ట్రాఫిక్ నిబంధనల సూచనల బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చౌరస్తాలో రోడ్లపై అస్తవ్యస్తంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దాని వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. పోలీసులు రోడ్లపై వాహనాలు నిలుపకుండా చూడా లి. పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి.
చౌరస్తాలోని నాలుగు కూడళ్లలో వాహనదారులు అవగాహన లేక రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. కొందరు యువకులు సాయంత్రం మద్యం సేవించి అతివేగంగా ద్విచక్రవాహనాలు నడుపుతున్నారు. అలాంటి వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకోవాలి.