నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి8(నమస్తే తెలంగాణ): హోరెత్తుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగింపు సమాయానికి 48 గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధన మేరకు నే టి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. సోమవారం ప్రచారానికి చివరి రో జు కావడంతో అన్ని చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, సభలకు సన్నద్ధమయ్యారు. ముఖ్యనేతలు సైతం త మకే ఓటు వేయాలని ఓటర్లకు చివరిసారిగా వి జ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు 17 మున్సిపాలిటీల్లో ఈ నెల 4వ తేదీ నుంచి గు ర్తులతో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు.
అప్పటి నుంచి ప్రతినిత్యం ప్రచారంలో మునిగితేలుతూ ఒక్కో అభ్యర్థి ఒక్కో ఓటరు ఇంటి తలుపును కనీసం ఐదురుసార్లు తట్టి ఉంటా రు. కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను, ఎన్నికల హామీలపై మోసాలను బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ శ్రేణులు ఇం టింటికి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, వాటిలో అభివృద్ధి పనులను మరోసారి ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్తూ ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఎన్నికల ఇన్చార్జీలు, ఇతర ముఖ్య నేతలంతా వారం రోజులుగా ప్రజల్లోనే ఉంటూ అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలు భుజానెత్తుకున్నారు.
రోడ్‌షో చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో అధికార కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటూ ఎక్కడా తగ్గకుండా బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులంతా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి సైతం జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తరవాత తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతలుగా అన్ని అస్త్రశస్ర్తాలు ప్రయోగిస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు వెనకాడకుండా ప్రచార దశలోనే ప్రలోభాలకు తెరలేపారు. విచ్ఛలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ సాయంత్రం కాగానే ఖరీదైన మద్యం బాటిళ్లతో రంగంలోకి దిగారు. ఒక్కో వార్డులో ఇప్పటికే సగటున రూ.10 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియగానే పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, ఇతర ఖరీదైన గిఫ్టులతో ఓట్ల కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.