యాదగిరిగుట్ట, మార్చి 29 : యాదగిరిగుట్ట మండలం శనివారం మండలం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్(పీఈఎల్) యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 390 ఓట్లకుగానూ బీఆర్ఎస్కేవీకి 209 మంది కార్మికులు మద్దతుగా ఓట్లు వేశారు. సీఐటీయూకి 179 ఓట్లు వచ్చాయి. హెచ్ఎంఎస్ ఒకటి, బీఎంఎస్ ఒక్క ఓటుతో సరిపెట్టుకున్నాయి.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కేవీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ కార్మికులు ఈ స్థాయిలో బీఆర్ఎస్కేవీకి మద్దతు పలుకలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ అనుబంధ కార్మిక అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ మద్దతుగా నిలిచిన సీఐయూటీకి కార్మికుల మద్దతు అంతగా లభించలేదు. ఫలితం వెల్లడి అనంతరం ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ సాధించిన బీఆర్ఎస్కేవీ కార్మికుల ఆనందానికి అవధుల్లేవు.
పీఈఎల్ కంపెనీ ఆవరణంలో బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవాలు చేశారు. పటాకులు కాలుస్తూ సంబురాలు జరిపారు. జయహో బీఆర్ఎస్ కేవీ.. జయహో బీఆర్ఎస్… జై జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి కార్మికుడు గులాబీ రంగును పూసుకుని పండుగ చేశారు. గొంగిడి మహేందర్‌రెడ్డి కార్మికులకు స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే బీర్ల ఒత్తిళ్లకు తలొగ్గని కార్మికులు
పీఈఎల్ కంపెనీ యజమాన్యాన్ని మెప్పించి, కార్మికుల పక్షాన నిలువాలంటే దానికి రాజకీయ చరిష్మానే కాదు.. కార్మికుల పట్ల అవగాహన ఉండాలని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులు ఓ టు వేసేందుకు ఎన్ని కుయుక్తులు పన్నారో తమకు తెలుసునన్నారు. అధికారంలో ఉండి కార్మికులపై ఆయన చేసి ఒత్తిడి ఇంత అంతాకాదన్నారు. రానున్నది విశ్వవసు నామ సంవత్సర ఆరంభామే కాదని.. బీఆర్ఎస్ గెలుపు నామ సంవత్సరమని పేర్కొన్నా రు.
బీఆర్ఎస్కేవీ చరిత్రలో ఇది గొప్ప విజయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగంతోపాటు సీఐటీయూ, వామపక్షాల కార్మికులంతా ఏకమైనా బీఆర్ఎస్కేవీ విజయా న్ని అడ్డుకోలేకపోయారని తెలిపారు. కార్మికుల పక్షాన నిలిచే ఏకైక కార్మిక సంఘంగా మరోసారి బీఆర్ఎస్కేవీ చరిత్రలో నిలిచిందన్నారు. రానున్నది కేసీఆర్ పాలననేనని కార్మికులకు అల్టిమేటం ఇచ్చారని పేర్కొన్నారు. పీఈఎల్ కార్మికులందరికీ బీఆర్ఎస్కేవీ అండగా నిలుస్తుందన్నారు. 12వ వేతన ఒప్పందాన్ని కార్మికులు మెచ్చే విధంగా ప్రతి కార్మికుడి సమక్షంలో సాధిస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్కేవీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.