నల్లగొండ సిటీ, మే 27 : ఆరుగాలం కష్టపడుతున్న రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన దుకాణ డీలర్లపై ఉందని చండూరు సీఐ ఆదిరెడ్డి అన్నారు. విత్తన డీలర్లు బాధ్యతగా వ్యవహరించి మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని సూచించారు. మంగళవారం కనగల్ మండలంలోని పలు విత్తన దుకాణాలు, ఫెర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు.
గతంలో నకిలీ విత్తనాల కేసుతో సంబంధం ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. రైతులు కంపెనీ విత్తనాలే ఎంచుకోవాలని, లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాలకు వచ్చే మధ్యవర్తుల వద్ద విడి విత్తనాలు కొనుగోలు చేయొద్దని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. డీలర్లు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు అంటగడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.