దేవరకొండ, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని దుయ్యబట్టారు. రైతు బోనస్ బోగస్ చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాట నీటి మూటలాయే అన్నారు.
పింఛన్లు పెంచడం దేవుడెరుగు, నూతన పింఛన్లు లేవు, ఉన్న పింఛనల్లోనూ కోత విధించినట్లు తెలిపారు. అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ.2,500 గురించి ప్రస్తావనే లేదన్నారు. చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ.4 వేల పింఛన్ గురించి ఒక్క మాట లేదన్నారు. ఇగ 420 హామీలకు దిక్కే లేదని ఎద్దేవ చేశారు. పరిపాలనను గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Devarakonda : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్