కట్టంగూర్, మే 14 : అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పందనపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు రమేశ్ రెడ్డి, ప్రియాంక ఇద్దరు సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి వెంకట్ రెడ్డి తన కుమార్తె ప్రియాంక (26)ను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించాడు. 2023లో హంట్స్ విల్లే (యూఏహెచ్)లోని యూనివర్సిటీలో చేరి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.
ఈ నెల 4న ప్రియాంక దంత సంబంధిత అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఈ నెల 6న స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోవడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. వెంటిలెటర్ అమర్చి ఒక రోజు వైద్యం అందించారు. ఈ 8న మృతిచెందినట్లుగా ప్రకటించారు. దీంతో ప్రియాంక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బుధవారం ప్రియాంక డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.