పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు తలనొప్పిగా మారారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి బాధలు భరించలేక సెక్రటరీలు టెన్షన్ పడుతున్నారు. స్థానిక నేతల చెప్పినట్టు నిబంధలనకు విరుద్ధంగా చేయబోమన్న కార్యదర్శులు బదిలీల పేరుతో బలి అవుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నెల రోజుల్లో 30మంది వరకు డిప్యూటేషన్ పై స్థానం చలనం పొందడం చర్చనీయంశంగా మారింది. ప్రధానంగా ఆలేరు నియోజకవర్గంలో ఈ సమస్య కనిపిస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 గ్రామ పంచాయతీలు ఉండగా, సుమారు 375 మంది పంచాయతీ సెక్రటరీలు పని చేస్తున్నారు. గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అన్నీ తామై వారే చూసుకుంటున్నారు. అయితే.. కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్టు సెక్రటరీ నడుచుకోవాలని హుకూం జారీ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. నిబంధన విరుద్ధంగానైనా తమ పనులు చేసి పెట్టాలని ఇబ్బందుల గురి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే.. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. వీటిల్లోనూ తాము చెప్పిన వారిని, అనర్హులైనా జాబితా చేర్చాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డులు తదితర పథకాల్లో తమ వారిని చేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ పలుచోట్ల సెక్రటరీలు ఇలా పలు రకాల పనులు చేసి పెట్టేందుకు వెనకడుగు వేశారు.
పంచాయతీ సెక్రెటరీ తాము చెప్పినట్టు వినకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు వారిపై గుర్రుగా ఉన్నారు. దీంతో బడా ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని.. తమ మాట వినని సెక్రటరీలపై వేటు వేయిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ బదిలీలు లేవు. దీంతో డిప్యూటేషన్ పేరుతో వేరే మండలాలకు మారుస్తున్నారు. బడా ప్రజాప్రతినిధులు చెప్పడంతో జిల్లా అధికారులు సైతం ఆర్డర్లు ఇస్తున్నారు. జిల్లాలో ఒక్క నెలలోనే 30 మంది వరకు పంచాయతీ సెక్రటరీలు స్థానచలనం పొందారు. సాధారణంగా అవసరాలను బట్టి ఒకటి రెండు చోట్ల డిప్యూటేషన్ చేస్తారు. కానీ ఇంతమందిని మార్పు చేయడంపై సెక్రటరీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పళంగా మార్చడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక కారణాలతో సెక్రెటరీలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిధులను ఆపేసింది. గ్రామాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
ఎంపీఓలకు సైతం కాంగ్రెస్ నేతల ఇబ్బందులు తప్పడం లేదు. తమ మాట వినకపోవడంతో ఎంపీఓలను సైతం వేరే మండలాలకు మారుస్తున్నారు. రాజకీయ కారణాలతో ఓ మండల ఎంపీఓను డిప్యూటేషన్ పై బదిలీ చేయించయడంతో సదరు అధికారి హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ రద్దు చేయించుకున్నారు.
మండలాల్లో పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్ ఇలా..