Chintakindi Mallesham | ఆలేరు టౌన్, మార్చి 9 : రాజకీయ చదరంగంలో పద్మశాలీల వాటా కోసమే పద్మశాలి మహాసభలు అని ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఆలేరు మండల కేంద్రం నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే పద్మశాలి మహాసభలకు ఆదివారం బయలుదేరుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల కోసం, పద్మశాలీల హక్కుల కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి పద్మశాలి బిడ్డపై ఉందన్నారు. చట్టసభల్లో పద్మశాలి వాణి వినిపించినప్పుడే, సమాజంలో సముచిత స్థానం లభిస్తుందన్నారు.
పద్మశాలి కులవృత్తిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పద్మశాలి కుల బాంధవులందరూ సమైక్యంగా ఉద్యమించినప్పుడే, హక్కులను సాధించగలుగుతామన్నారు. ఆలేరు మండలంలోని టంగుటూరు, షారాజుపేట, మదనపల్లి, కొలనుపాక, గ్రామాల నుండి ఆలేరు పట్టణంలోని భారత్ నగర్, బీసీ కాలనీ, క్రాంతి నగర్, సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, చింతల బస్తి, కాటమయ్య నగర్ తదితర ప్రాంతాల నుండి చేనేత కళాకారులు పద్మశాలి కుల బాంధవులు హలో చలో పద్మశాలి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాసికంటి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షులు బింగి నర్సి0హులు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బడుగు జాంగిర్, క్రాంతి నగర్ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు మెరుగు శ్రీధర్, టంగుటూరు పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మీనారాయణ, ఆలేరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు సామల సత్య ఋషి, చేనేత కళాకారులు రేగోటి వెంకటేష్, ఉప్పలయ్య, మచ్చ శ్రీనివాస్, కాముని రవి, చింత కింది గిరిధర్, సత్యనారాయణ, బిర్రు నాగులు, చేనేత కళాకారులు, కుల బంధువులు పాల్గొన్నారు.