రామన్నపేట, ఫిబ్రవరి19 : కూరెళ్ల సేవలకు రాజ్‌భవనే వెల్లంకి గ్రామానికి వచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ, మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రెండు లక్షల పుస్తకాలతో ఏర్పాటు చేసిన కూరెళ్ల గ్రంథాలయాన్ని, రూ.రెండు కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. కూరెళ్ల రచించిన విఠలేశ్వర శతకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించారు. కూరెళ్ల కృషి వల్ల వెల్లంకి గ్రామం తెలంగాణ చిత్రపటంలో ప్రముఖ స్థానం పొందిందని ప్రశంసించారు.
ఆచార్య కూరెళ్ల విఠలాచార్య ఎంతో సమకూర్చి అమూల్యమైన జ్ఞాన సంపదను భావితరాలకు అందించి ఆదర్శ ప్రాయంగా నిలిచారన్నారు. గ్రంథాలయంలో సమకూర్చిన పుస్తకాలు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని తెలిపారు. 8.500 పుస్తకాలు, 1000 నోట్ పుస్తకాలతోపాటు రూ. 10,63,070 ప్రొసీడింగ్ కాపీని కూరెళ్లకు గవర్నర్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూరెళ్ల కుటుంబ సభ్యులు గవర్నర్‌కు జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి కూనూరు లక్ష్మణ్‌గౌడ్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెడంగే, పోరెడ్డి రంగయ్య, ఏనుగు నర్సింహారెడ్డి, ఎస్.రఘు, బెల్లి యాదయ్య పాల్గొన్నారు.