రామగిరి, మార్చి 10 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేసు విచారణలో ఉన్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం బయట ఒక విధమైన గంభీరమైన వాతావరణం కనిపించింది. కులాంతర వివాహం నేపథ్యంలో మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు తుది తీర్పు సోమవారం వస్తుందని ముందే ప్రచారం జరుగడంతో ఉదయం కోర్టు సమయానికి ముందే ఆ పరిసరాలకు నిందితుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, మీడియాతోపాటు సామాన్య జనమూ పెద్దసంఖ్యలో చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ఎస్సీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కోర్టు ప్రధాన ద్వారం నుంచి కోర్టు ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికి వెళ్లాలన్నా వివరాలు తెలుసుకుని, తనిఖీ చేసి మాత్రమే అనుమతించారు. నిందితులను పోలీసులు ప్రత్యేక వాహనాల్లో కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో టెన్షన్ మరింత పెరిగింది. ఐదున్నర సంవత్సరాల పాటు సాగిన విచారణలో వాదోపవాదాల అనంతరం కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. నాటి హత్యకు సంబంధించి మాట్లాడుకోవడం, తీర్పునకు సంబంధించిన ఊహాగానాలు వినిపించాయి. కాగా, ఉదయం 11:30 గంటల నుంచి 12 గంటల సమయంలో నల్లగొండ రెండవ అదనపు సెషన్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలనాత్మక తుది తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో దోషుల్లో ఒకరి మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి ఈ తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దోషులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. దవాఖానకు తరలించే సమయంలో దోషుల కుటుంబ సభ్యులు, బంధువులు వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని ప్రశాంతంగా తీసుకువెళ్లారు. తీర్పు నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత, ఆయన తల్లిదండ్రులు కోర్టుకు వస్తారోమోనని అక్కడున్నవాళ్లు భావించినప్పటికీ వాళ్లు రాలేదు. మరోవైపు తీర్పు అనంతరం కేసులో దోషులుగా తేలిన వారి కుటుంబ సభ్యులు కొందరు తమవాళ్లు తప్పు చేయలేదంటూ గగ్గోలు పెట్టారు. కోర్టు ఆవరణలోని న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు తీర్పును స్వాగిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి దంపతులు మిర్యాలగూడలో స్పందిస్తూ తమ బిడ్డను దారుణంగా చంపిన వాళ్లకు సరైన శిక్ష పడిందని తెలిపారు.
శ్రవణ్‌కుమార్ కూతురి హల్చల్
తీర్పు అనంతరం మారుతీరావు సోదరుడు తిరునగరి శ్రవణ్‌కుమార్(ఏ6) భార్య, కుతూరు నల్లగొండ కోర్టు ఆవరణలోకి కారులో వచ్చారు. కారు దిగిన శ్రవణ్‌కుమార్ కూతురు స్ఫూర్తి పోలీసులు తన తండ్రిని అన్యాయంగా కేసులో ఇరికించారని, బెదిరించి బ్లాంక్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారని ఆరోపిస్తూ పెద్దపెట్టున అరించింది. తన తండ్రిని నిర్దోషిగా విడుదల చేయాలని, లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఏడ్చింది. తన పెద్దనాన్న చేసిన తప్పునకు తన నాన్నను అన్యాయంగా బలి చేశారంటూ, ఇదంతా అమృత వల్లేనని హల్చల్ చేసింది. మీడియా అధిక ప్రచారం వల్ల తన తండ్రి దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆగ్రహంతో ఊగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని కోర్టు ఆవరణలో మాట్లాడానికి అవకాశం లేదని, కోర్టు తీర్పు వచ్చిందని చెప్పి ఆమెను కారులో ఎక్కించి బయటకు పంపించారు.
జరిగింది ఇది..
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు(వైశ్య) కుమార్తె అమృత అదే పట్టణానికి చెందిన పెరుమళ్ల బాలస్వామి కుమారుడు ప్రణయ్(ఎస్సీ) 2018 జనవరి 30న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ కులాంతర వివాహం అంగీకరించని మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను అదే సంవత్సరం సెప్టెంబర్ 14న హత్య చేయించాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మారుతీరావు సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ 1,600 పేజీల చార్జ్‌షీట్ పెట్టారు. ఎనిమిది మందిపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.
ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి తిరునగరి మారుతీరావు(ఏ-1) కేసు విచారణ నడుస్తున్న సమయంలోనే 2020 మార్చి 7న హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్యసమాజ్ భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ-2 సుభాష్‌శర్మ, ఏ-3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు 2019లో బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరయ్యారు. ఐదున్నర సంవత్సరాలపాటు ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సాక్షులను విచారించి వివరాలు నమోదు చేసి తుది తీర్పు వెల్లడించింది. మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, మిగిలిన వారిలో బిహార్‌కు చెందిన సుభాశ్(ఏ2) ఉరి శిక్షతోపాటు రూ.15వేలు జరిమాన, నల్లగొండకు చెందిన మహ్మద్ అస్గర్ అలీ(ఏ2), మహమ్మద్ అబ్దుల్ బారీ(ఏ4), మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం(ఏ5), మారుతీరావు సోదరుడు తిరునగరి శ్రవణ్‌కుమార్(ఏ6), మారుతీరావు డ్రైవర్ సముద్రాల శివ(ఏ7), నల్లగొండకు చెందిన ఆటో డ్రైవర్ ఎంఏ నజీమ్(ఏ8)కు జీవిత ఖైదీతోపాటు రూ.10వేల జరిమానను విధించింది.
నా బిడ్డను చంపిన వాళ్లకు సరైన శిక్ష పడింది
ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి
మిర్యాలగూడ : తన కుమారుడు ప్రణయ్‌ను అతి దారుణంగా చంపిన నిందితులకు కోర్టు సరైన శిక్ష విధించిందని పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. తీర్పు అనంతరం మిర్యాలగూడ పట్టణంలో మీడియా ఎదుట ఆయన స్పందించారు. మారుతీరావు సుపారీ ఇచ్చి తమ బిడ్డను దారుణంగా హత్య చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య తరువాత తాము చాలా కోల్పోయామని, న్యాయం కోసం పోరాటం చేశామని తెలిపారు. ప్రణయ్ హత్య తరువాత కూడా చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి వారందరికీ కోర్టు ఇచ్చిన తీర్పుతో కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. నిందితులుగా ఉండి శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, కానీ ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని తెలిపారు. అంతకుముందు కుటుంబసభ్యులు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి సమాధిపై పూలు చల్లి నివాళులర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తీర్పును స్వాగతిస్తున్నాం
ప్రణయ్ హత్య కేసులో పోలీసులు పూర్తి విచారణ చేసి సీసీ పుటేజీలతోపాటు నిందితుల కదలికలపై పూర్తి సమాచారంతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీసీ పుటేజీలు, నిందితులు వాడిన ఫోన్లు, సైంటిఫిక్ సమాచారంతోపాటు అన్ని రకాల సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. విచారణ అనంతరం తీర్పు వెల్లడించింది. కేసు వాదించడంలో పోలీసులు అందజేసిన సమాచారం ఎంతో కీలకంగా పని చేసింది. నిజం గెలిచింది.. కష్టానికి ఫలితం దక్కింది. ప్రత్యేక న్యాయవాదిగా కేసు విచారణలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉన్నా… ఇంకా కులం అంటూ పరువు హత్యలను జరుగుతుండడం బాధగా ఉంది. ఇటీవల సూర్యాపేటలో జరిగిన ఘటన కూడా ఒకటి.
– దర్శనం నర్సింహ, స్పెషల్ పీపీ, ప్రణయ్ హత్య కేసును వాదించిన లాయర్, నల్లగొండ
పోలీసుల పాత్ర భేష్ : ఎస్పీ శరత్చంద్ర పవార్
నీలగిరి : ప్రణయ్ హత్య కేసు విచారణ సమయంలో సరైన ఆధారాలు సేకరించి, సాక్ష్యులను ప్రవేశ పెట్టి దోషులకు శిక్ష పడేలా చేయడంలో పోలీసులు నిర్వహించిన పాత్ర అభినందనీయమని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. తీర్పు అనంతరం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీలకంగా వ్యవహరించిన ప్రణయ్ హత్య కేసులో కీలకంగా ప్రస్తుత మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజుతోపాటు అప్పటి విచారణ అధికారి మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్, ప్రస్తుత డీఎస్పీ రాజశేఖర రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్, ఎస్సై సైదిరెడ్డి, సిబ్బంది వీరస్వామి, మధుసూదన్, నరేందర్, మల్లిఖార్జున్‌ను అభినందించారు. సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోశ్, ఏఆర్ఎస్ఐ నాగరాజు ఉన్నారు.
పరువు హత్యలు ఆగాలి
ఒక మహిళకు జరిగిన అన్యాయం పట్ల మహిళా న్యాయమూర్తి కేసును పూర్తిగా విచారించి సంచలనాత్మకమైన తీర్పు వెల్లడించడం సంతోషంగా ఉంది. ఈ తీర్పుతోనైనా సమాజంలోకి ఒక మంచి మెసేజ్ వెళ్లాలి. మళ్లీ పరువు హత్యలు జరుగకుండా ఉండాలి.
– మామిడి ప్రమీల, ప్రముఖ న్యాయవాది, నల్లగొండ