నీలగిరి, జూలై 18 : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు అన్నారు. మేము సైతం, కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలోని మైసమ్మగుడి సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ డి.సైదాబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
అంతేగాకుండా గ్రామాల్లో ఎటువంటి నేరాలు, దొంగతనాలు జరగకుండా, ఏదైనా నేరం జరిగితే దోషులను, నిందితులను గుర్తించేందుకు వీలుంటుందన్నారు. నేర పరిశోదనలో పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, దుకాణాల్లో, కాలనీల్లో ఇండ్ల వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం సీసీ కెమరాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు ఎంఎం రాజు, శంకర్రాజు, సిబ్బంది తిరుమలేశ్, జానకిరాములు పాల్గొన్నారు.
Nalgonda : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం : సీఐ రాఘవరావు