యాదగిరిగుట్ట, జనవరి4: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గత నెల 23న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఆదివారం ముగిశాయి. స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనలు అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని అలకంరించి ఆళ్వారాధుల ముందు ప్రబంధ పారాయణాలను పారాయణికులచే పఠించి, భక్తుల దర్శనార్థం తిరుమాడ వీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయంలో ఉత్సవ మూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవం ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యుల ఆధ్వర్యంలో పాంచరాత్రగమ సంప్రదాయ రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
రామానుజ నుత్తందారి ఉపదేశరత్తినమాలై అనుసంధానం గావించి అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. అనంతరం అధ్యయనోత్సవాలకు విచ్చేసిన దివ్య ప్రబంధ పారాయణికులను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రధానాలయంలో అర్చకులు వేద మంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించారు. ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో దోర్బల భాస్కర్, ఆలయ అధికారులు రఘు, నవీన్, జూశెట్టి కృష్ణ, రాజన్‌బాబు, సురేందర్‌రెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం..
అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టలో తాత్కాలికంగా నిలిపివేసిన స్వామి, అమ్మవార్ల నిత్య, శాశ్వత కల్యాణోత్సవం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శ నారసింహ హోమం సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు యధావిధిగా పూజలు కొనసాగుతాయన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.