– టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా శాఖ డిమాండ్
రామగిరి, జూలై 13 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నెం.53 ద్వారా 01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేశ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా అదే ప్రాతిపదికన పాత పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల స్ఫూర్తితో, 01-09-2004కు ముందు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ (CPS) ఉద్యోగుల ఆందోళనను గుర్తించి, సిపిఎస్ రద్దుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు కోరారు.