అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు నెలలుగా జిల్లాలోని సుమారు 1500ల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. వీరంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. మార్చిలో కొత్త కాంట్రాక్టులకు అగ్రిమెంట్లు చేయాల్సి ఉండగా అవి కాకపోవడం, మరో పక్క పాతవి తాత్కాలికంగా రెన్యువల్ చేయకపోవడం చూస్తుంటే అధి కారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నాలుగు నెలలుగా వేతనాలు రిలీజ్ కాకపోవడంతో ఉద్యోగుల ఈఎస్ఐ ల్యాప్స్ అయినట్లు తెలిసింది. అలాగే పీఎఫ్ రెన్యువల్ చేయాలంటే ప్రతీ నెలా వడ్డీ, పీనల్ డామేజెస్ చెల్లించాల్సి ఉంది. ఒకవేళ కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే వడ్డీ, జరిమానా కలిపి సుమారు రూ. 1.08 కోట్లు అవుతుందని, వీటిని ఎలా చెల్లించాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
సూర్యాపేట, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు అప్పగించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. చిరు ఉద్యోగులకు వేతనాలు అందక నాలుగు నెలలు గడుస్తున్నా కనీస పట్టిం పు లేకుండా పోయింది. దీంతో జిల్లాలోని వివిధ డిపార్టు మెంట్లలో పనిచేస్తున్న సుమారు 1500ల మంది వేతనాల కోసం ఎదరు చూస్తూ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. నెలనెలా వేతనం వస్తేనే పూట గడిచే వారి కుటుంబాలు, నాలుగు నెలలుగా వేతనాలు రాకపోతే ఎ లా బతకాలో ఎవరూ ఆలోచించడంలేదు. వారికి అప్పు కూడా పుట్టకపోవడంతో గత నెలలో కొం తమంది కలెక్టరేట్‌కు వెళితే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా వస్తారని హెచ్చరించి పంపించారే తప్ప తప్ప తమ బాధలను ఎవరూ పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ (ఔట్ సోర్సిం గ్) ఏజెన్సీలకు కేటాయిస్తారు. అయితే జిల్లాలో కేటాయింపులు ఎలాంటి పారదర్శకత లేకుండా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఇష్టం ఉంటే అర్హత లేని ఏజెన్సీలను కూడా దొంగ దారిన తెచ్చి కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ సారి మార్చిలో కొత్తగా కాంట్రాక్టులు ఖరారు చేసి అగ్రిమెంట్లు చేసి కొనసాగించాల్సి ఉండగా ఏమైందో… ఏమో కానీ ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎంప్యానల్ జాబితా ఖరారు చేసినప్పటికీ కాంట్రాక్టులు మాత్రం అప్పగించలేదు.
గత నాలుగు నెలలుగా కొత్త కాంట్రాక్టులు ఖరారు చేయకపోగా పాత వారినైనా రెన్యువల్ చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయి ఉద్యోగుల ఈఎస్ఐ ల్యాప్స్ అయింది. జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు రూ.15,600ల నుంచి మొదలుకొని 26వేల వరకు వేతనం తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రతీ నెలా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ ద్వారా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు జరుగుతాయి. ఒక ఉద్యోగికి ఈఎస్ఐ ఉంటే ఆ కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యం పాలైతే ఉచితంగా చికిత్స అందుతుంది. కానీ గత నాలుగు నెలలుగా వేతనాలు నిలిచి పోవడంతో ఈఎస్ఐ ల్యాప్ అయినట్లు ఓ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ద్వారా తెలిసింది. ఒక ఉద్యోగికి చివరి ఆరు నెలల్లో 78 రోజులు ఈఎస్ఐ చెల్లించి ఉంటేనే కార్డు పని చేస్తుందని తెలిసింది. కానీ నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఈఎస్ఐ ల్యాప్స్ అయింది. అధికారుల నిర్లక్ష్యంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందకపోగా భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే తమకు దిక్కెవరంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఉద్యోగులకు పీఎఫ్ ఎలా అనేది అయోమయంగా మారింది. ఉద్యోగికి అందే వేతనాన్ని బట్టి కాంట్రాక్టర్ పీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ చెల్లింపులు నిలిచి పోతే సెక్షన్ 7క్యూ ప్రకారం ఇంట్రెస్ట్ అలాగే సెక్షన్ 14బీ ప్రకారం పీనల్ డ్యామెజ్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగికి ప్రతి నెలా రూ.1800ల వరకు ఉంటుంది. వేతనం అందని నాలుగు నెలలు కలపి రూ.7200లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలోని దాదాపు 1500ల మంది ఉద్యోగులకు 1.08 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యేపనేనా అంటే అనుమానమే. ఇలాంటి పరిస్థితి జిల్లాలో గతంలో ఏనాడూ చోటు చేసుకోలేదని అంతే కాకుండా రాష్ట్రంలో కూడా ఇతర ఏ జిల్లాలో కూడా జగలేదని పలువురు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల సక్రమంగా లేక తమకు వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నామని అలాగే వైద్య భద్రత కూడా లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు రిలీజ్ చేయాలని వేడుకుంటున్నారు.