మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారి బాధలు పట్టించుకునే వారే లేకపోయారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని బిక్కుబిక్కుమంటున్నా పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కేసీఆర్ సర్కార్ హయాంలో పురుడుపోసుకున్న డయాలసిస్ కేంద్రాలకు రోగుల తాకిడి పెరుగుతున్నది. దీంతో రోగుల అవసరాలకు అనుగుణంగా వాటి సంఖ్య పెంచాల్సిన కాంగ్రెస్ సర్కార్ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఉన్న డయాలసిస్ కేంద్రాల్లో బెడ్స్ కొరత కూడా రోగులను తీవ్రంగా వేధిస్తున్నది. డయాలసిస్ కోసం ప్రభుత్వ దవాఖానల్లో రోగులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నది.
– నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
కాలానుగుణంగా మారుతున్న జీవన విధానాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రక్తపోటు, చకరవ్యాధి అదుపులో లేకపోవడం, పొగతాగడం, మద్యపానం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కిడ్నీ వ్యాధులకు గురవుతున్న పరిస్థితి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ముఖ్యంగా మూత్రపిండాలు చెడిపోయిన వారికి డయాలసిస్ తప్పనిసరి అవుతున్నది. డయాలసిస్ కోసం సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడేవారు. ఆర్థికంగానూ తీవ్ర భారం కావడంతో ఇల్లు, ఒళ్లు గుల్ల కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో గత కేసీఆర్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లా కేంద్ర ఆస్పత్రులతోపాటు ఏరియా ఆస్పత్రుల వరకు డయాలసిస్ సేవలను దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేలకు మంది పైగా డయాలసిస్ సేవలు పొందుతున్న రోగులు ఉన్నట్లు అంచనా. అయితే రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యధికంగా డయాలసిస్ సేవలు పొందుతున్న వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులే ఉన్నట్లు నిమ్స్ ఆస్పత్రి బృందం ఇటీవల నిర్వహించిన సర్వే స్పష్టమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు వేలకుపైగా డయాలసిస్ రోగులు ఉన్నట్లు అంచనా.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 10 డయాలసిస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. నల్లగొండ జనరల్ ఆసుపత్రిలో 10 పడకలతో, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, చౌటుప్పల్లో ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్లు గత సర్కార్ హయాంలోనే అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో దాదాపు షిప్టుల వారీగా ప్రతిరోజూ 200 నుంచి 250 మంది రోగులు సేవలు పొందుతున్నారు. ఇవి కాకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొంత మంది సొంతంగా డబ్బులు వెచ్చిస్తూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు రక్తశుద్ధి చేయించుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా నెఫ్రాలజీ డాక్టర్లు అందుబాటులో లేకపోయినా ట్రెయినీ టెక్నీషియన్ల నేతృత్వంలో డయాలసిస్ కొనసాగుతున్నది. ఎమర్జెన్సీ సందర్భాల్లో ఫిజీషియన్లు పర్యవేక్షిస్తున్నారు.
డయాలసిస్ అవసరమైన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ఆయా డయాలసిస్ కేంద్రాల్లో బెడ్లకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా డయాలసిస్ మిషన్ల సంఖ్యను, వార్డుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ వస్తున్నది. గత సర్కార్ సేవలుకు శ్రీకారం చుట్టగా అవే సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అయితే రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుత సర్కార్ వీటి సంఖ్య పెంచడంపై దృష్టి సారించడం లేదు. దీంతో రోగులు తమకు ఎప్పుడు బెడ్ దొరుకుతుందా అని రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. కొన్నిసార్లు డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్ మృతి చెందితే తప్ప కొత్తగా మరొకరికి బెడ్ దొరుకని పరిస్థితి నెలకొంది. నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో 10 మిషన్లు ఉండగా… అందులో 8 మిషన్లు సాధారణ వ్యక్తులకు, ఒకటి హెచ్ఐవీ, మరొకటి హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు కేటాయించారు. మిగతా ప్రాంతాల్లో నాలుగు మిషన్లు సాధారణ రోగులకు, మిగతాది ఇతరులకు సేవలు అందిస్తున్నాయి. అయితే నల్లగొండ ఆస్పత్రిలో ప్రస్తుతం 36 మంది డయాలసిస్ సేవల కోసం నిరీక్షిస్తూ పేర్లు నమోదు చేసుకుని ఉండడం గమనార్హం. ఇదేవిధంగా మిర్యాలగూడలో 10 మంది, దేవరకొండలో 15 మంది, ఇతర ఆస్పత్రుల్లోనూ ఇలాగే బెడ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇలా జిల్లాలోని అన్ని డయాలసిస్ సెంటర్లలో మరో 150 మంది వరకు బెడ్స్ కోసం రోగులు నిరీక్షిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం బెడ్లు, సేవల సంఖ్యను పెంచకపోవడంతో సామాన్య ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లడం, ప్రైవేటు దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇది ఆర్థికంగా తీవ్ర భారం కావడంతో పాటు కుటుంబమంతా ఆస్పత్రుల చుట్టే తిరుగాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని డయాలసిస్ సెంటర్లన్నీ ఉస్మానియా హాస్పిటల్ హబ్ కింద పని చేస్తున్నాయి. వీటిల్లో నెఫ్రాలజీ సేవలు కూడా తరుచూ అందుబాటులో ఉండేలా చూడాలన్న డిమాండ్ వస్తున్నది. ప్రస్తుతం ఆరు నెలలకు ఓ సారి ఉస్మానియా నుంచి స్పెషలిస్ట్ వచ్చి డయాలసిస్ సెంటర్లను విజిట్ చేసి రోగుల హెల్త్ ప్రొఫైల్ను చెక్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సెంటర్లతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలో హాలియా, నకిరేకల్, ఆలేరు, మోతూరు, తుంగతుర్తి, మర్రిగూడ లాంటిచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే బాధితులకు మరింత ఉపశమనం కలుగునుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కిడ్నీ వ్యాధిగ్రస్తులు కోరుతున్నారు.
జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న మాట వాస్తవమే. జనరల్ ఆసుపత్రి డయాలసిస్ వార్డులో బాధితులను వెయిటింగ్లో ఉంచి డయాలసిస్ చేయాల్సి వస్తున్నది. నకిరేకల్, హాలియాకు ఐదు చొప్పున మిషన్లు మంజూరైనా సరైన భవనం లేక పెట్టలేక పోయాం. మర్రిగూడ, మిర్యాలగూడల్లో మరో ఐదు పడకల చొప్పున త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నం. ప్రస్తుత కేంద్రాల్లో సాధ్యమైనంత ఎక్కువ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నం. కిడ్నీ స్పెషలిస్టు వైద్యుల కోసం కూడా ఉన్నతాధికారులకు నివేదించాం.
– డాక్టర్ మాతృనాయక్, డీసీహెచ్ఎస్, నల్లగొండ