నాగార్జున సాగర్, ఆగస్టు 3 : శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం ఎన్ఎసీపీ అధికారులు నాగార్జున సాగర్ డ్యాంలోని క్రస్ట్‌గేట్లను మూసి వేశారు. సాగర్‌లో 590 అడుగుల గరిష్ట నీటిమట్టానికి గాను ప్రస్తుతం 585.90 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి 48,082 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తం నీటిని నాగార్జున సాగర్ జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి కుడి కాల్వకు 8604 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వకు 8022 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కుల నీటిని ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,356 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు రావడంతో గత నెల 29న క్రస్ట్‌గేట్ల ద్వార దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గడంతో శనివారం నుంచి ఎన్ఎస్పీ అధికారులు డ్యాం క్రస్ట్‌గేట్లను క్రమక్రమంగా మూసివేస్తూ ఆదివారం ఉదయం పూర్తిగా మూసివేశారు.
సాగర్ జలాశయంలోని క్రస్ట్‌గేట్ల ద్వార గత ఐదు రోజులుగా ఎన్ఎస్పీ అధికారులు వరదనీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నాగార్జున సాగర్ వచ్చారు. ఆదివారం కావడంతో నాగార్జున సాగర్‌లో పర్యాటకుల రద్దీ పెరిగింది. క్రస్ట్‌గేట్ల నుంచి కృష్ణమ్మ కిందకు దుంకుతున్న సుందర దృశ్యాలను చూసేందుకు నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. డ్యాం దిగువన, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, శివాలయం, కొత్తబ్రిడ్జి, పాత బ్రిడ్జిలపై నిలబడి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. దీంతో సాగర్‌లో ట్రాపిక్ జామైంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వాహన రాకపోకలను క్రమబద్ధీరించి ట్రాపిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ఆదివారం సెలవు దినం కావడంతో సాగర్ అందాలను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన పర్యాటకులతో సాగర్‌లో ట్రాఫిక్ జామైంది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం నాడే అధికారులు క్రస్ట్‌గేట్లను కూడా మూసివేయడంతో వారు నిరాశ చెందినారు.