కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెబుతున్నట్లుగా రూ.21వేలు పెట్టుబడి పెడితే మొదటి నెల రూ.15 లక్షలు ఆదాయం వస్తుందని ఫేస్బుక్లో వచ్చిన ఓ ఆకర్షణీయమైన ప్రకటనకు ఇటీవల వైద్యశాఖలో పనిచేసే చిరుద్యోగి సూర్యాపేట పట్టణానికి చెందిన సత్యం (అసలు పేరు కాదు) ఆన్లైన్లో డబ్బులు పంపించాడు. అత్యధిక లాభం ఎలా వస్తుంది..? వ్యాపారం ఏమిటీ..? వచ్చే లాభం ఎవరు పంపిస్తారు..? అన్న ఆలోచనలేకుండా ఆశతో ప్రకటనలో కనిపించిన ఓ లింక్ ఓపెన్ చేసి డబ్బు పంపించాడు.
మూడు నెలలు గడిచినా రూ.21వేలకు సంబంధించి ఎలాంటి రిైప్లె లేదు. అంతే కాకుండా సదరు వ్యక్తి మధ్యలో ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెబితే రూ.15 లక్షలు పంపిస్తామనడంతో అనుమానం వచ్చి ఎదురు ప్రశ్నించడంతో ఫోన్ కట్ అయింది. దీంతో తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించిన బాధితుడు ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే మధనపడ్డాడు. ఇలాంటి సంఘటనలు రోజూ ఎన్ని జరుగుతున్నాయో ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారో…
సూర్యాపేట టౌన్, జూలై 27 : అవును.. నిజం.. చూసేవన్నీ నిజాలు కాదు… చెప్పేవన్నీ వాస్తవాలు కావు.. ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలలో అత్యాశకు పోతే అధోగతి తప్పదు… నిజనిజాలు తెలుసుకోకుండా కలర్‌ఫుల్ యాడ్స్.. ప్రముఖుల వ్యాఖ్యలు నమ్మి పెట్టుబడి పెడితే జేబుగుల్ల కాదు..ఇల్లే గుల్లవుతుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తే దేశంలోని ప్రముఖ వ్యక్తులు, దిగ్గజ సంస్థల అధినేతలతో తక్కువ పెట్టుబడి పెట్టి అత్యధిక లాభాలు ఆర్జించవచ్చనే ప్రకటనలు లెక్కలేనన్నిగా కనిపిస్తున్నాయి. వేలల్లో పెట్టుబడి పెడితే ఊహించని రీతిలో లక్షల్లో ఆదాయం వస్తుందంటూ కళ్లకు కట్టినట్లు నమ్మించేలా కనిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెబితే అబద్ధం అనుకుంటామా..? ప్రపంచ కుబేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తప్పుడు ప్రచారం చేస్తాడా..? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రచారం నిజం కాదనుకుంటారా..? జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు అసత్యాలవుతాయా..? వీరే కాదు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ప్రజాదరణ పొందిన వ్యక్తులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు నిత్యం సోషల్ మీడియాలో రూపాయి పెట్టుబడి పెట్టండి… లక్షల్లో సంపాదించండంటూ ఊదరగొట్టే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ రంగాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆన్లైన్ ట్రేడింగ్, షేర్లు తదితర వాటిలో డబ్బు పెట్టి లాభాలు పొందాలని సదరు వీడియోల్లో చూపిస్తున్న ప్రకటనలు వాస్తవానికి పచ్చి మోసం. ఇలాంటి వాటిని నమ్మి మోసపోయేవారు మన రాష్ట్రంలో కూడా కోకొల్లలు అలాగే సూర్యాపేట జిల్లాలో కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తుండటం గమనార్హం. రూ.21 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి లక్షలు, కోట్లు సంపాదించవచ్చనే అత్యాశతో పాటు అత్యంత ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో ప్రచారం చేయిస్తుండడంతో నిజమేనని నమ్మి డబ్బులు పెట్టి మోసపోతున్నారు.
తస్మాత్ జాగ్రత్త… అంతా ఏఐ సృష్టే..
సోషల్ మీడియాలో రూపాయికి వెయ్యి రూపాయలంటూ ఊదరగొట్టే ప్రముఖుల ప్రచారాలన్నీ వాస్తవాలు కాదు. అవన్నీ టెక్నికల్‌గా రూపొందించే అభూత కల్పనలు. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో సృష్టించిన ఫేక్ వీడియోలు… వాస్తవానికి ఏఐ వచ్చిన తరువాత ఐటీ కంపెనీల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. మంచికి ఏ స్థాయిలో ఏఐ ఉపయోగపడుతుందో అంతకు మించి చెడుకు వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇందుకు ఉదాహరణే ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్టా తదితర సోషల్ మీడియల్లో కొద్దిమేర పెట్టుబడితో ఊహకు అందని రీతిన డబ్బు సంపాదించవచ్చనే దిగ్గజాల ప్రచారం. ఇలాంటి ప్రకటనలతో మధ్య తరగతి వారే ఎక్కువ మోసపోతున్నారు. వీటి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా ఇలాంటి అక్రమాలపై పోలీసులు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నకిలీ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియాలో ప్రముఖుల పేరిట తక్కువ పెట్టుబడితో అధిక మొత్తంలో లాభాలు వస్తాయనే ప్రకటనలను ఎవరూ నమ్మవద్దు. సైబర్ మోసగాళ్లు మన కంటికి కనిపించరు కానీ ఆశ చూపి డబ్బులు దోచేస్తారు. కొంత కాలంగా ఇండియన్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ సైబర్ మోసగాళ్లు ప్రముఖులతో నకిలీ ప్రచారాలు చేస్తున్నారు. కష్టపడి సంపాదించే కష్టార్జితాన్ని అత్యాశకు పోయి పోగొట్టుకోవద్దు.
-నరసింహ, జిల్లా ఎస్పీ, సూరాపేట