యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 30: పాడి రైతుల శ్రేయ స్సు కోసమే పురుడు పోసుకున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) సంస్థ తీవ్ర నష్టాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యలే కారణమని నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీక్రెడ్డి స్పష్టం చేశారు. ఆలయాలకు నెయ్యి సరఫరా, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు పాల సరఫరా నిలిచిపోయి నార్ముల్ సంస్థ మూసివేసే పరిస్థితికి వస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వారు పాడి రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రైతులు రావాల్సిన 8 పెండింగ్ బిల్లులు ఇప్పించలేకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయన్నారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పాడి రైతు సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్థ భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారన్నారు. ఎమ్మెల్యే తాను ఇచ్చిన హామీ నెరవేరిస్తే బాగుంటుందని లేకపోతే పాడి రైతులు చేతుల్లో చెప్పు దెబ్బలు ఖాయమన్నారు. 2023 అక్టోబర్‌లో జరిగిన పాలక మండలి ఎన్నికల్లో స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి హామీల వర్షం గుప్పించారన్నారు. 300 మంది పాల సంఘాల చైర్మన్లతో క్యాంపు నిర్వహించి వారిని మభ్యపెట్టారన్నారు. తమను గెలిపిస్తే రూ.5 బోనస్, రూ.30 కోట్ల ప్రభుత్వ గ్రాంట్స్‌తోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. సంస్థ మూసివేసే దిశకు చేరుకున్నా ఇప్పటి వరకు ఆ హామీపై అటు మంత్రి కోమటిరెడ్డి, ఇటు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నోరెత్తడంలేదు. తమ హయాంలో రూ.50 కోట్ల నష్టాల్లో ఉండగా రోజుకు 40 వేల లీటర్ల నుంచి 1.20 లక్షల లీటర్ల వరకు పెంచి నష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేశారు.
హాస్టళ్లకు పాల సరఫరా, యాదగిరిగుట్ట దేవస్థానంతో పాటు చెర్వుగట్టు, వేములవాడ దేవస్థానాలకు సైతం స్వచ్ఛమైన నెయ్యి విక్రయిస్తూ మెరుగైన ఆదాయంతో కొనసాగించారు. 95 వేల లీటర్ల పాల ను మార్కెటింగ్ చే సి విక్రయాలు జరిపామన్నారు. పాడిరైతుల ఆర్థిక పురోభివృద్ధికి లీట రు పాలకు రూ. 5 పెంచామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో జిల్లా మం త్రులు, ఎమ్మెల్యేల ప్రమేయంతో ఏ ర్పాటైన పాలకవర్గ నిర్వాకంతో పాల కొనుగోలు రోజుకు కేవలం 30 నుంచి 40 వేల లీటర్లకు పడిపోయిందన్నారు. వేములవాడ, చెర్వుగట్టుకు నెయ్యి సరఫరా రద్దు కావడంతోపాటు యాదగిరిగుట్టకు సైతం త్వర లో నెయ్యి సరఫరా నిలిపివేసే పరిస్థితి వస్తోందన్నారు. దీంతో నెలకు రూ. 1.80 కోట్ల ఆదాయానికి గండిపడినట్టేనని స్పష్టం చేశారు.
ఆడిటింగ్ లెక్కలు తప్పు చేశారన్న మాట అవాస్తవని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన ముగ్గురు డైరెక్టర్లకే పాడి రైతులు పట్టం కట్టారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, నార్ముల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిని పాడి రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. హయత్‌నగర్‌లో 102 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో 29 ఎకరాలు, మిర్యాలగూడలోని 1.5 ఎకరాలు, ఆలేరు, పరిగి, భువనగిరి తదితర ప్రాంతాలతో కలిపి నార్ముల్ సంస్థకు సుమారు 157 ఎకరాల భూములున్నాయి. వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని, ఆ భూములు అమ్మాలని చూస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు.