నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి3.(నమస్తే తెలంగాణ)/నీలగిరి : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది. సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు సెలవు దినాల్లో(8,9 తేదీల్లో) మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 11న పరిశీలన, 12న అభ్యంతరాల స్వీకరణ, 13న ఉపసంహారణ గడువు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా వెల్లడికానుంది. ఈ నెల 27న పోలింగ్, వచ్చే నెల 3న నల్లగొండలోని ఆర్జాలబావి గోదాములో కౌంటింగ్ జరుగనుంది. కాగా తొలి రోజు ప్రజావాణి పార్టీ తరుపున లింగిడి వెంకటేశ్వర్లు ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్
నల్లగొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా తాను, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు వ్యవహరిస్తారని తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పకుండా పాటించాలన్నారు. అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పణ, అన్నెక్సర్ 26 ఫొటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అమె కోరారు. నియోజవకర్గం మొత్తం 24,905 మంది ఓటర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎల్లుండి నుంచి నామినేషన్ల దాఖలు ఊపందుకోవచ్చని తెలుస్తున్నది. ఇప్పటికే దాదాపుగా ప్రధాన సంఘాల నుంచి అభ్యర్థులంతా ఖరారు అయ్యారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంచిరోజు చూసుకుని నామినేషన్ల దాఖలుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభల నిర్వహణకు కూడా సన్నహాలు చేస్తున్నారు.