మోతె, ఏప్రిల్ 4 : కడుపునిండా అన్నం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకుంటే కన్నకొడుకులే కర్కశంగా వ్యవహరించి ఆమెను కాటికి పంపేలా చేస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్న ఆ శతాధిక వృద్ధురాలి ఆకలి కేకలను ఎవరూ పట్టించుకోవడంలేదు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని నామవరం గ్రామానికి చెందిన నల్గంతుల వెంకమ్మ (95), భర్త రాములు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమారులు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య ఉన్నారు. తండ్రి మృతి చెందాక, తల్లిని మంచిగా చూసుకుంటామని నమ్మబలికిన కొడుకులు ఆమె పేరు మీద ఉన్న మూడెకరాల తొమ్మిది గుంటల భూమిని తలా ఒక ఎకరం మూడు గుంటల చొప్పున తల్లితో సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అనంతరం ఆమెకు కొన్ని రోజులుగా సద్ది బువ్వ, ఇన్ని నీళ్లు పోసి నానా ఇబ్బందులు పెట్టారు. తన గోడును ఎవరికైనా చెబుదామనుకుంటే బయటకు వెళ్లనివ్వకుండా గేటుకు తాళం వేసి ఇబ్బందులకు గురి చేశారని ఆమె రోదిస్తూ తెలిపింది. అంతేకాకుండా అమ్మతో మాకేం పని అంటూ ఆమెను ఒంటరిని చేసి ఊర్లో వదిలేసి వెళ్లిపోయారు. కొడుకులు చేసిన పనికి ఆమెకు బుక్కెడు బువ్వ కరువైంది. దీంతో ఆమె తన కొడుకులకు బుద్ధి చెప్పి బుక్కెడు బువ్వ పెట్టించండంటూ స్థానికుల సాయంతో సూర్యాపేటలోని ఆర్డీవోను కలిసి మొరపెట్టుకుంది. స్పందించిన ఆర్డీవో వెంటనే ఆమె ముగ్గురు కొడుకులను పిలిపించి, ఒక్కక్కరూ నెలకు రూ.15 వందల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.
అయినప్పటికీ వారు ఆర్డీవో ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వృద్ధురాలైన ఆ తల్లిని అక్కడే వదిలేసి వెళ్లారు. ఆమె కొడుకు కుమారుడు (మనవడు) శీను కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా అవ్వకు న్యాయం చేసేవారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వెంకమ్మ ప్రస్తుతం కుమార్తెను ఆశ్రయించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి నడుములు విరిగిన కన్నతల్లిని పోషించలేక కూతురు సైతం ఇబ్బందులు పడుతోంది. ఆస్తి మొత్తం లాగేసుకుని అందలమెక్కిన ముగ్గురు కొడుకులకు బుద్ధిచెప్పి బుక్కెడు బువ్వ పెట్టించాలని, ఆమె ఆవేదనను అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.